2012 ముగిసిపోతోంది. ఈ ఏడాది తెరపైనే కాదు తెర వెనుక రసవత్తరమైన పోరు
జరిగింది. ఇండస్ర్టీలో హిట్ శాతం పెరిగిందని లెక్కలేసేలోపే లెక్కలేని
వివాదాలు టాలీవుడ్ ను సతమతం చేశాయి. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాల
వివాదాలు కూడా టాలీవుడ్ ను పట్టిపీడించాయి. కులం, మతం, ప్రాంతాల విషయంలో
సినిమాలు వేలుపెట్టాయి. దాంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిరసన జ్వాలలు
ఎగిసిపడ్డాయి.
ఈ ఏడాది ప్రారంభంలోనే మహేష్‌బాబు, పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో విడుదలైన
'బిజినెస్ మేన్'లోని ఐటం సాంగ్ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రంలో వియ్ ఆర్
బ్యాడ్ బాయ్స్ అనే పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని ఆ
పాటను తొలగించాలని గొడవలు చేశారు. ఈ వివాదం కొంతకాలం కొనసాగి ఆ తర్వాత
చల్లారింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై
కూడా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తెలంగాణ ఉద్యమాన్ని, ఇక్కడి ప్రజల
మనోభావాలను కించ పరిచే విధంగా సీన్లు, డైలాగులు ఉన్నాయని తెలంగాణ
వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. డైరెక్టర్ పూరీ, నిర్మాత దిల్ రాజు ఆఫీసులపై
కూడా తెలంగాణ వాదులు దాడులు చేశారు. సినిమాలోని అభ్యంతరకరమైన సీన్లు
తొలగిస్తామని ప్రకటించడంతో వివాదం కాస్త చల్లారింది.
ఈ ఏడాది వివాదం ఎదుర్కొన్న మరో పెద్ద సినిమా రచ్చ. రిలీజ్ కు ముందే ఈ
సినిమా వివాదంలో ఇరుక్కుంది. ఒక పాటలో గౌతమ బుద్దుని విగ్రహం ముందు అశ్లీల
సన్నివేశాలు చిత్రీకరించారని జాతీయ అరుంధతీ మహిళా శక్తి సంఘం నుంచి తీవ్ర
అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది బ్రహ్మణ సంఘాలు కొన్ని సినిమాలపై
కన్నెర్రచేశాయి. తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ బ్రహ్మణులు రొడ్డేక్కారు.
టైటిల్ వివాదాలు కూడా ఎదుర్కున్నాయి కొన్ని సినిమాలు. 'ఏ ఉమెన్ ఇన్
బ్రాహ్మణిజం' చిత్రం మరో వివాదానికి కేంద్ర బిందువైంది. సమాజంలోని ఒక వర్గం
స్త్రీలను అసభ్యంగా చిత్రీకరించారంటూ ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాపై
నిరసనలు వెల్లువెత్తాయి. బ్రాహ్మణ స్త్రీలను తప్పుగా చూపారని, సినిమాను
నిషేధించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ వర్గీయులు ఆందోళన చేశారు. చలం
రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా రూపొందించిన చిత్రం అంటూ బ్రాహ్మణ
స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. ఈ
సినిమాపై వేసిన కమిటీ ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం
చేసింది. అయితే ఈ చిత్రం నిర్మాతలు మళ్లీ కమిటీ నియామకం చెల్లదని హై
కోర్టుకు వెళ్లారు.
ఇక దేనికైనా రెడీ సినిమా సృష్టించిన వివాదం అంతాఇంతా కాదు. ఈ సినిమాలో
బ్రహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ సామాజిక వర్గం
రాష్ర్టవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి
నాలుగు వారాల పాటు ఈ వివాదం మోహన్ బాబు కుటుంబం వర్సెస్ బ్రాహ్మణులుగా
మారింది. చివరకు కేసులు, కోర్టులు, హెచ్చార్సీల వరకు వెళ్లిందీ సినిమా
వ్యవహారం. మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా, యువతను పక్కదారి
పట్టించేదిగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన చిత్రం ‘సారీ టీచర్'. ఈ
చిత్రంపై మొదట రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అయితే 'సారీ టీచర్'కు
యుబైఏ సర్టిఫికెట్ ఇచ్చామని.. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దాన్ని
ఏకగ్రీవంగా ఆమోదించిందని సెన్సార్ తెలిపింది. సినిమా మానవ హక్కులను
ఉల్లంఘిస్తున్నట్లు, మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉందనడాన్ని,
యువతను పక్కదారి పట్టించేదిగా ఉందన్న వాదనను సెన్సార్ బోర్డు కొట్టి
పారేసింది. అయితే ఈ చిత్రం చట్టపరంగా వచ్చిన అన్ని అవరోధాలను తొలగించుకుని
విడుదలైంది.
ఇక ఈ రోజుల్లో సినిమా దర్శకుడు మారుతి తెరకెక్కించిన 'బస్ స్టాప్' చిత్రం
విడుదల రోజే వివాదంగా మారింది. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించేలా
బస్‌స్టాప్ సినిమాలో సంభాషణలూ, దృశ్యాలూ ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. ఈ
సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ఎదుట ధర్నాలు జరిగాయి. ఇది 'ఎ'
సర్టిఫికేట్ చిత్రం. యూ, యూబైఎ అని ఇవ్వలేదే. కొందరు కావాలని సినిమాను
అడ్డుకుంటున్నారని సెన్సార్ బోర్డ్ చేతులు దులుపుకుంది. శ్రీకాంత్ నటించిన
దేవరాయ సినిమా కూడా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ సినిమాలో
శ్రీకృష్ణ దేవరాయలును కించపరిచేలా చిత్రీకరించిన ‘దేవరాయ' చిత్రంలోని
అసభ్యకర దృశ్యాలను వెంటనే తొలగించకపోతే ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకోవటమేగాక
సెట్‌లను తగులబెడతామని రాష్ట్ర కాపునాడు ఒక ప్రకటనలో హెచ్చరించింది.
శ్రీకృష్ణదేవరాయల పాలనను అవహేళన చేస్తే ఊరుకోమని ఆందోళన చేశారు.
సినిమాలకు టైటిల్ వివాదాలు కూడా చుట్టిముట్టాయి. నాగార్జున నటించిన డమరుకం
సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. తాము డమరుకం టైటిల్ రిజిస్టర్
చేయించుకున్నామని.. అయితే ఆర్ఆర్ మూవీస్ వారు ‘ఢ' బదులు ‘డ' తగిలించి
‘డమరుకం' పేరుతో సినిమాను తీసుకువస్తున్నారని యువ దర్శక నిర్మాతలు..ప్రమోద్
కుమార్ గౌడ్,మనోజ్ కుమార్ ఆరోపించారు. ఫిలించాంబర్ ముందు ఆందోళన
నిర్వహించారు. అంతేకాదు ఈ టైటిల్ వివాదం కోర్టుకు కూడా వెళ్లింది. టైటిల్
వివాదం ఎదుర్కున్న మరో సినిమా రవితేజ నటించిన 'దరువు'. నిజానికి దరువు
అనేది 1999 లో విద్యార్ధి కళాకారుల ఆధ్యర్యంలో ఏర్పడిన సంఘం. సామాజిక
వివక్షలపై, ప్రాంతీయ వివక్షలపై ఆటై, పాటై ఒక ఉన్నత ఆశయం కోసం
పనిచేస్తోందని, దాన్ని వల్గర్ సినిమాకు టైటిల్ గా పెట్టారని, దాన్ని
తొలిగించాలని దరువు సంఘం డిమాండ్ చేసింది. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న
నాయక్ సినిమాకు కూడా టైటిల్ వివాదం చుట్టిముట్టింది. ఈ సినిమాకు ‘నాయక్'
అనే టైటిల్ పెట్టడాన్ని తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.
గిరిజన విద్యార్థి సంఘం నేతలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా
కోసం గిరిజన ఆత్మగౌరవానికి సంబంధించిన ‘నాయక్' అనే పదాన్ని వాడరాదని, ఈ పదం
గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని సినిమా వ్యాపారం కోసం
వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, వెంటనే ‘నాయక్' టైటిల్ ను మార్చాలని
డిమాండ్ చేసారు. లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది టాప్ హీరోల సినిమాల మధ్య సరికొత్త గొడవ మొదలైంది. కరవమంటే కప్పకు
కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా.. హీరోలు నేరుగా రంగంలోకి
దిగకపోయినా.. అభిమానుల హంగామాతో గొడవ తారస్థాయికి చేరుకుంది. బాలకృష్ణ,
నాగార్జున సినిమాలతో థియేటర్ యజమానులు చిక్కుల్లో పడ్డారు. శిరిడిసాయి
సినిమాకోసం కూకట్ పల్లి అర్జున్ థియేటర్లో శ్రీమన్నారాయణ సినిమాని
తీసేయడంతో.. ఏకంగా నిర్మాత, దర్శకుడు రోడ్డెక్కారు. ఒక సినిమాకోసం
డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరూ థియేటర్ల ముందు ధర్నా చేయడం.. ఇండస్ట్రీలో
ఇదే తొలిసారి.
సినిమాలు రాజకీయాలను కూడా టార్గెట్ చేసి వివాదానికి తెర తీశాయి. కృష్ణవందే
జగద్గురం సినిమాలో లక్ష కోట్ల అవినీతి అంటూ పోసాని కృష్ణ మురళి చెప్పిన
డైలాగ్.. పరోక్షంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి అన్న
వ్యాఖ్యలే అనే ప్రచారం కొనసాగింది. అవి జగన్‌ను ఉద్దేశించి అన్న డైలాగ్
కాదని, బళ్లారిలో గనుల అవినీతి పరుడి గురించే అని, ఓబులాపురం గనుల కేసులో
గాలి జనార్ధన్ రెడ్డిపై అవినీతి రుజువైంది కాబట్టి.... ఆ డైలాగ్ ఆయనకు
వర్తిస్తుందని పోసాని స్పష్టం చేసారు.
వివాదం మంచిదే కదా అనే మూవీ మేకర్లు లేకపోలేదు. సినిమాపై నెగిటివ్ గా ఏదైనా
జరిగితే మంచి పబ్లిసిటీ వస్తుందని... దాంతో కాసులు కురుస్తాయని ఆశ పడే
నిర్మాతలూ ఉన్నారు. అయితే సినిమా అనేది వినోదాత్మకంగా, సందేశాత్మకంగా
ఉండాలే కాని, ప్రాంతాన్ని, మతాన్ని, ఓ భాష, ఇతరుల మనోభావాలను కించపరిచేలా
ఉండకూడదు. సన్నివేశాల్ని నిబంధనల ప్రకారం అనుమతించాల్సిన సెన్సార్ బోర్డు
కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే వివాదాలకు కాస్తమేరకు అయినా పుల్స్టాప్
పెట్టవచ్చు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడే నిర్మాతలకూ చెక్ పెట్టొచ్చు.
మొత్తానికి ఈ ఏడు వివాదాలతో గుణపాఠం నేర్చుకున్న టాలీవుడ్.. వచ్చే ఏడాది
ప్రారంభంలో వివాదాలు లేకుండా సినిమాలు అందిస్తుందని ఆశిద్దాం.
Home
»
cameraman Ganga tho Rambabu
»
DAMARUKAM
»
Film news
»
Nagarjuna
»
PAWAN KALYAN
» 2012 Tollywood Fights : టాలీవుడ్లో ఎగిసిపడ్డ వివాదాలు : 2012 Roundup
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment