హైదరాబాద్: కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అనుసరించబోయే వైఖరి స్పష్టం కావడం లేదు. వైయస్ జగన్ ఆయనకు సహకరిస్తారా, ఆయనపై కూడా తిరుగుబాటు ప్రకటిస్తారా అనేది తెలియడం లేదు. వైయస్ జగన్ వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులు ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశంసించడం ప్రారంభించారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని పట్టుబడుతూ వచ్చిన కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తనకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేయాలని ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైయస్సార్ తో కలిసి పనిచేసే అవకాశం రాలేదని, ఇప్పుడైనా ఆ అవకాశం వస్తుందో లేదో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. మరో శాసనసభ్యుడు జోగి రమేష్ కూడా కిరణ్ కుమార్ రెడ్డికి తన పూర్తి మద్దతు తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పట్ల సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఎంపిక కోసం బుధవారం రాత్రి జరిగిన సిఎల్పీ సమావేశంలో కూడా జగన్ వర్గం శాసనసభ్యులు ఏమీ మాట్లాడలేదు. అయితే, వారు అంత సానుకూలంగా లేరని సాక్షి టీవీ చానెల్ వార్తాకథనం, శాసనసభ్యురాలు కొండా సురేఖ మాటలను బట్టి తెలుస్తోంది. సిఎల్పీ సమావేశం సందర్భంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యవహరించిన తీరును తప్పు పడుతూ సాక్షి టీవీ చానెల్లో గురువారం ఓ వార్తాకథనం ప్రసారమైంది. తమ అభిప్రాయాలను తెలుసుకోవాలని 30 మంది శానససభ్యులు ఆయనను కోరారని గులాం నబీ ఆజాద్ వారించడంతో వారిలో కొంత మంది వెనక్కి తగ్గారని సాక్షి వార్తాకథనం తెలిపింది. , ఏమైనా అభిప్రాయాలు ఉంటే సిఎల్పీ సమావేశం తర్వాత తాను వింటానని ప్రణబ్ చెప్పారని, కానీ ఆ అవకాశం ఇవ్వలేదని ఆ వార్తాకథనం సారాంశం. ఆ తర్వాత శాసనసభ్యులు కొండా సురేఖ, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కారు వద్దకు వెళ్లి తమ అభిప్రాయాలు వినాలని అడిగారని, అయినా ఆయన పట్టించుకోలేదని తెలిపింది.

2014 ఎన్నికల్లో పార్టీని గెలిపించగలిగే సత్తా నాయకుడ్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని తాము అడిగామని, అయితే పేరు మాత్రం తాము ప్రతిపాదించలేదని కొండా సురేఖ చెప్పారు. ఓకే, ఓకే అంటూ ప్రణబ్ ముఖర్జీ వెళ్లిపోయారని ఆమె చెప్పారు. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతూనే మరోవైపు మెత్తగా వైయస్ జగన్ వర్గానికి చెందినవారు విమర్శలు మొదలు పెట్టారని భావించవచ్చు. వైయస్సార్ కుటుంబంతో కిరణ్ కుమార్ రెడ్డిని పోల్చవద్దని తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు, జగన్ వర్గానికి చెందిన నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ కు చెక్ పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారనే అభిప్రాయాన్ని ఆయన ఖండించారు.

ఎంతగా విశ్లేషించినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి పట్ల వైయస్ జగన్ వైఖరిపై అంతగా స్పష్టత రావడం లేదు. మంత్రివర్గ ఏర్పాటు వరకు జగన్ వర్గం వేచి చూడాలని అనుకుంటూ ఉండవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి తమ పట్ల అనుసరించే వైఖరిని బట్టే తమ వ్యూహం ఉండాలని అనుకుంటున్నారని కూడా అనుకోవచ్చు.

0 comments:

Post a Comment

 
Top