పార్టీ అధిష్టానం మనోగతాన్ని అర్థం చేసుకోకుండా దూకుడుతో వెళ్లడం వల్లనే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు నష్టం చేసిందనే అబిప్రాయం వ్యక్తమవుతోంది. రాయలసీమకు చెందిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని అనూహ్యంగా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడాన్ని బట్టి చూస్తే ఆ అభిప్రాయం నిజమేనని అనిపించకమానదు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన వెంటనే శాసనసభ్యుల సంతకాల సేకరణ, చిరంజీవి మద్దతుకు విజ్ఞప్తి వంటి అత్యుత్సాహ ప్రదర్సన నుంచి మొదలు పెడితే సాక్షి దినపత్రికలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వార్తాకథనం ప్రచురించడం వరకు ఆయన ప్రతి అడుగూ వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని దూరం చేస్తూ వచ్చింది. అధిష్టానం అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పోతుండడమే కాకుండా వైయస్ జగన్ వర్గం వాటిని సమర్థించుకోవడానికి చేసిన వాదనలు కూడా నష్టమే కలిగించాయని చెప్పవచ్చు.

తనకు ప్రజాదరణ ఉందని, తనకు మించిన ప్రజాకర్షణ గల నాయకుడు పార్టీలో లేరని, వైయస్సార్ మరణానికి సంబంధించిన సానుభూతి తనకే దక్కుతుందని భావిస్తూ ఆయన ముందుకు దూసుకుపోవడానికే ప్రయత్నించారు. ఓదార్పు యాత్ర విషయంలోనూ అదే విధంగా వ్యవహరించారు. ఒక రకంగా సోనియా గాంధీని బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో ఆయన వ్యవహార శైలి ఉందనే అభిప్రాయానికి బలం చేకూరుస్తూ వచ్చారు. తనను తాను సమర్థించుకోవడానికి వైయస్ జగన్ చేసిన ప్రయత్నాలన్నీ సాంకేతికపరమైనవే. ఆయన వర్గీయులు ఆ సాంకేతిక కారణాలనే చూపుతూ జగన్ అధిష్టానాన్ని వ్యతిరేకించడం లేదనే ఏకపక్ష వాదనను ముందు పెడుతూ వచ్చింది. సాంకేతిక కారణాలకు, వాస్తవాలకు మధ్య అంతరం చాలా ఉంటుందనే విషయాన్ని జగన్ గానీ ఆయన వర్గం గానీ గుర్తించినట్లు లేదు.

మొదటి తప్పటడుగును సరిదిద్దుకుని మౌనంగా ఉండిపోతే వైయస్ జగన్ కు తప్పకుండా ముఖ్యమంత్రి పదవి దక్కి ఉండేదనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన తీరు చూస్తుంటే ఆ అభిప్రాయంలో నిజమెంతో అర్థమవుతుంది. తనకు విధేయులుగా ఉంటూ, తమ మాటకు విలువనిచ్చే నాయకులకే పదవులు దక్కుతాయనే విషయాన్ని వైయస్ జగన్ గానీ ఆయన వర్గం గానీ పట్టించుకోలేదు. కాంగ్రెసుకు చెందిన వి. హనుమంతరావు వంటి కొద్ది మంది నాయకులపై నిరంతరం విమర్శలు చేస్తూ వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైయస్ జగన్ వర్గం పార్టీ నాయకత్వాన్నే ప్రశ్నిస్తూ వచ్చింది. ఒక్కటొక్కటిగా వేస్తూ వేస్తూ వచ్చిన తప్పటడుగు వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పీఠం అందకుండా చేస్తూ వచ్చింది. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుని, ప్రజల చేత అవుననిపించుకుంటే తప్ప ముఖ్యమంత్రి పీఠం అందే పరిస్థితి లేదు. ఆయన వర్గం కూడా ఒక్కరొక్కరే కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సరెండర్ అయ్యే వాతావరణం నెలకొంది. శాసనసభ్యుడు జోగి రమేష్ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ప్రశంసించడం, సిఎల్పీ సమావేశంలో నోరెత్తే పరిస్థితి కూడా తన వర్గం శాసనసభ్యులకు లభించకపోవడం చూస్తుంటే వైయస్ జగన్ కు ముందున్నవి గడ్డురోజులేనని అర్థం చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment

 
Top