తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ,  వైకాపాలు తమ వైఖరిని ఎలా వెల్లడిస్తాయనే విషయంపై ఆసక్తికర చర్చజరుగుతుంది. ఈ మూడు పార్టీలు అఖిలపక్ష సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెల్లడిస్తారోననేది సస్పెన్ప్ గా ఉంది. తెలంగాణాకు తాము వ్యతిరేకం కాదని మాత్రమే టిడిపి చెబుతుండగా, ఇచ్చేది, తెచ్చేది తామేనని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అయితే ఇచ్చేశక్తి, ఇస్తే ఆపేశక్తి తమకు లేదని వైకాపాలు తమ వైఖరిని తెలియజేస్తుండగా అఖిలపక్షంలో ఈపార్టీలు ఎటువంటి వైఖరిని తెలియజేస్తాయోననే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశంపార్టీ మాత్రం తాము తెలంగాణాకు అనుకూలమని ఎక్కడ స్పష్టం చేయకపోవడంతో పాటు వైకాపా కూడా తెలంగాణాకు అనుకూలంగా ఉన్నామంటూ ప్రకటించక పోవడంతో పార్టీల వైఖరి బయట పడడం లేదు. కాగా తెలుగుదేశంపార్టీ, వైకాపాలు మాత్రం ముందుగా కాంగ్రెస్ పార్టీ తమవైఖరిని తెలియజేయాలని వత్తిడితెచ్చే ఆలోచనలో ఉన్నాయి. అదే విధంగా అఖిలపక్షంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ అఖిలపక్షం నుండి వాకౌట్ చేసే ప్రయత్నంలో వైకాపా, టిడిపిలున్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితిలో తమ వైఖరిని తెలియజేయడం కోసం సిద్దంగా ఉండే అవకాశం లేనందున అఖిలపక్షం మధ్యలోనే ముగిసిన ఆశ్చర్యం లేదు. ఇటువంటి పరిస్థితిలో మీరు ముందుగా అంటే మీరు ముందుగా అనే విధంగా మూడు పార్టీల మధ్యన అఖిలపక్షం మద్యంతరంగా ముగిసే అవకాశముంది. అయితే టిఆర్ఎస్, బిజెపి, సిపిఐలు తెలంగాణ విషయంలో స్పష్టంగా ఉండడంతో ఈ మూడు పార్టీల వైఖరి తెలంగాణకు అనుకూలంగానే ఉంటుంది. కాగా సిపిఎం మాత్రం వారి సిద్దాంతం ప్రకారం సమైక్యాంధ్రకు అనుకూలంగా తమ వైఖరిని తెలియజేసేందుకు సిద్దంగా ఉంది. ఇక మజ్లీస్ పార్టీ మాత్రం సమైక్యాంధ్రను కోరుకుంటూనే ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రాయలతెలంగాణాను ఏర్పాటు చేయాలనే విషయాన్ని అఖిలపక్షంలో తెలియజేసే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం, వైకాపాల నిర్ణయం ఎలా ఉంటుందోననేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి చూపు ఈమూడు పార్టీలపైనే ఉంది. ఇటువంటి సందర్భంలో అఖిలపక్షంలో ఎటువంటి వైఖరిని తెలియజేస్తాయో వేచిచూడాల్సిందే.

0 comments:

Post a Comment

 
Top