కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా సాక్షి పత్రికలోనూ టీవీ చానెల్లోనూ ఇచ్చిన వార్తాకథనంపై పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి కె. రోశయ్య సహా పలువురు కాంగ్రెసు నాయకులు హస్తగతం వార్తాకథనంపై తీవ్ర విమర్సలు చేసినా ఏ మాత్రం జంకడం లేదు. తన వార్తాకథనాన్ని సమర్థించుకుంటూ సాక్షి దినపత్రికలో మరో వార్తాకథనం ప్రచురితమైంది. టీవీ చానెల్లో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కూడా ఆ వార్తాకథనం ప్రసారమైంది. తమపై విమర్శలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావుతో సహా అందరినీ ఆ వార్తాకథనం తప్పు పట్టింది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపామని ప్రకటించుకుంది. నిజమే చెప్పండి, ప్రజల పక్షాన నిలవండి, ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా నడవండి అని వైయస్ జగన్ ఇచ్చిన సందేశానికి అనుగుణంగా తాము వార్తాకథనాలు ఇస్తున్నామని సాక్షి సమర్థించుకుంది. సాక్షి మీడియా ఓ స్వతంత్రమైన వ్యవస్థ అని, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయదని తనకు తాను విలువలను ఆపాదించుకుంది.

125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ చానల్ ప్రసారం చేసిన విశ్లేషణాత్మక కథనంపై కొందరు తీవ్రంగా స్పందించారని, ముఖ్యమంత్రితో పాటు మరికొందరు నాయకులు దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారుని, అయితే ‘సాక్షి’ ఎప్పుడూ పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోంది ప్రజల పక్షానే నిలుస్తోందని మరోసారి మనవి చేస్తున్నామని, ఒక మీడియా సంస్థ సాధారణంగా చూసే విశ్లేషణాత్మక కోణం నుంచే ఆ కథనాన్ని ‘సాక్షి’ టీవీ ప్రసారం చేసిందని వివరణ ఇచ్చుకుంది. అయితే ఆ కథనంలో లేని అంశాలు ఉన్నాయంటూ, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారంటూ ఉన్నవీ లేనివీ ఆపాదించి తీవ్రంగా స్పందించారు. నిజానికి దివంగత ముఖ్యమంత్రి, మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ లోపాలను, ఇతర సామాజికాంశాలను ‘సాక్షి’ ఎత్తిచూపిందని, అలాంటి సందర్భాల్లో దివంగత రాజశేఖరరెడ్డి కూడా సరైన దృక్కోణం నుంచే వాటిని విశ్లేషించారని ప్రకటించుకుంది. ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పని చేయించడానికి పత్రిక ఉపయోగపడాలని ఆయన కాంక్షించారని, దివంగత రాజశేఖరెడ్డిపై ఆయా పక్షాల నేతలు నీచాతి నీచమైన ఆరోపణలు చేసిన సందర్భంలోనూ ఆ వార్తలను కూడా తగిన ప్రాధాన్యతనిచ్చే ప్రచురించింది ‘సాక్షి’ అని చెప్పుకున్నారు. రేపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా సాక్షి పంథా ఇదే’’ అంటూ ఇంతకు ముందు ఓసారి కుండబద్దలు కొట్టామని చెప్పుకుంది.

అయితే, సాక్షి ఎంతగా సమర్థించుకోవడానికి చూసినా వైయస్ జగన్ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగానే వార్తాకథనాలు ఇస్తోందనేది అందరికీ తెలిసిన విషయమే. సాక్షి వార్తాకథనాల ఆధారంగా జగన్ రాజకీయ భవిష్యత్తు కార్యక్రమాన్ని అంచనా వేయడానికి కూడా వీలవుతోంది. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడానికే జగన్ సాక్షి ద్వారా ఆ తెగువ చూపారని అంటున్నారు.

0 comments:

Post a Comment

 
Top