ట్రిపోలి: పాశ్చాత్య దేశాల భీకర సైనిక దాడులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇవేవీ లిబియా అధినేత మవుమ్మర్ గడాఫీ నిరంకుశ పీఠాన్ని కదిలించలేకపోతున్నాయి. లిబియాపై సంకీర్ణ సేనలు జరుపుతున్న దాడులను తిప్పికొడతామని ఆయన ప్రతినబూనారు. గెలుపు తమదేనని, అవసరమైతే అమరుడిగా కన్నుమూయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సంకీర్ణ దాడులు మొదలైన నాలు గు రోజుల తర్వాత బుధవారం ఆయన తొలిసారిగా రాజధాని ట్రిపోలీలోని తన నివాస ప్రాంగణం బాబ్ అల్ అజీజియాలో బాల్కనీ నుంచి తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగించారు.


ఈ ప్రాంగణంలోని ఆయన పాలనాభవనాన్ని సంకీర్ణ దళాలు నేలమట్టం చేయడం తెలిసిందే. మరోవైపు..ట్రిపోలీలోని సైనిక లక్ష్యాలపై పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలు బుధవారం కూడా దాడులు చేశాయి. రెబెల్స్‌కు, లిబియా సైనికులకు మధ్య బుధవారం పలు పట్టణాల్లో హోరాహోరీ ఘర్షణలు జరిగాయి. గడాఫీ పదవిలో కొనసాగినంత కాలం లిబియాపై జరుపుతున్న ‘ఆపరేషన్ ఒడిస్సీ డాన్’లో ఎలాంటి మార్పులూ ఉండవని అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపారు.

లిబియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు జరుపుతున్న సైనిక దాడులు అన్యాయమైనవని గడాఫీ అరోపించారు. ‘ఆ దాడులను త్వరలోనే తిప్పికొడతాం. మనపై ఫాసిస్టులు దాడి చేస్తున్నారు. భయం లేదు. నేనున్నా. నేనున్నా’ అని ఆయన అభిమానులనుద్దేశించి చేసిన ఆవేశపూరిత ప్రసంగంలో అన్నారు. ‘నేనిక్కడే, ఈ గడ్డపైనే ఉండి ప్రతిఘటిస్తా. ఈ చారిత్రక పోరాటంలో అవసరమైతే ప్రాణత్యాగం చేస్తా. లిబియన్లు తమ విశ్వసనీయతను చాటుకోడానికి రోడ్లపైకి రావాలి. దాడులకు భయపడొద్దు.

శత్రువులను వెంటాడి, వేటాడి నిర్బంధించాలి. అన్ని ఇస్లామిక్ సైన్యాలు నాతో చేతులు కలపాలి’ అని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగాన్ని జాతీయ టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. లిబియాలో నాటో దళాలు వైమానిక దాడులు జరపటాన్ని పార్లమెంటులో వామపక్షాలు, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. ఐరాస తీర్మానంపై సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top