ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మధ్య సమన్వయం లేకే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోయామని మంత్రి శంకర్‌రావు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆవేదన చెందారు. కాంగ్రెసు పార్టీకి బలం ఉండి కూడా ఓడిపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు బలం ఉందన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులను కూడా మంత్రులు విస్మరించారని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో పేర్కొనబడిన అంశాలను శంకర్‌రావు ఖండించారు. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో నక్సలిజం పెరుగుతుందని కమిటీ పేర్కొనడం తొందరపాటు చర్య అన్నారు. కమిటీ నివేదికలో వాస్తవం లేదన్నారు.

శ్రీకృష్ణ కమిటీపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ దొంగలముఠా అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ అంతా తప్పుడు నివేదిక ఇచ్చిందని అన్నారు. కాగా శ్రీకృష్ణ కమిటీ దొంగల ముఠా అయితే దాని నాయకులు కాంగ్రెసు పార్టీయే అని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

0 comments:

Post a Comment

 
Top