హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర ముగిసిందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్, ప్రజా గాయకుడు గద్దర్ గురువారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. టిఆర్ఎస్‌కు గ్రామీణ స్థాయిలో బలం లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయిలో నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతాన్ని నెత్తుటి మడుగులో ముంచిన కాంగ్రెసుతో టిఆర్ఎస్ చేరితో ప్రజలు క్షమించరని హెచ్చరించారు. జెఏసిల వల్లే తెలంగాణ ఉద్యమం బలపడిందన్నారు.



కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మొదటి నుండి మోసం చేసిందన్నారు. కాంగ్రెసును నమ్ముకునే పరిస్థితి లేదన్నారు. టిడిపి కూడా అడ్డు పడుతుందన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసే వారి వెంట తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉంటుందన్నారు. ఎవరి ట్రాప్‌లో ఎవరూ పడరన్నారు. అందరూ కలిస్తే తెలంగాణ ఖచ్చితంగా వస్తుందన్నారు.

టిఆర్ఎస్‌తో మిత్ర వైరుధ్యం మాత్రమే ఉందన్నారు. సామాజిక న్యాయం పునాదులపై తెలంగాణ ఏర్పాటు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇరుప్రాంతాల ప్రజలు వారి వారి ప్రజా ప్రతినిధులపై ఇందుకోసం ఒత్తిడి తేవాలన్నారు. బిజెపి పార్లమెంటులో బిల్లు పెడతామని చెప్పినప్పటికీ కాంగ్రెసు బిల్లు పెట్టక పోవడాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికే అందరితో కలిసి వెళతామని చెప్పారు. మా పాలన మాకు వచ్చే వరకు శాంతియుతంగా ఉద్యమం చేస్తామన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్ష ముందు తలవంచక తప్పదన్నారు. తెలంగాణకు పోరాడినంత మాత్రాన సీమాంధ్ర ప్రజలకు తాము వ్యతిరేకం కాదన్నారు. కేవలం మా పాలన మాకు కావాలని అడుగుతున్నామన్నారు. దీనిని అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఎక్కడ ఉన్నా పోరాడుతానని చెప్పారు. ఉత్తరాంధ్రలో, గుంటూరు తదితర ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. రాజకీయ పార్టీలతో తెలంగాణ రాదన్నారు.

0 comments:

Post a Comment

 
Top