అవాంతరాల నడుమ ప్రాక్టీస్ సెషన్
మసా ‘ఫాస్టెస్ట్’... ఆ తర్వాత వెటెల్
హామిల్టన్, పెరెజ్‌లపై మూడు గ్రిడ్‌ల పెనాల్టీ
టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు సుటిల్, రెస్టా
చివరిస్థానంలో కార్తికేయన్
నేడు ఇండియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్

ఇండియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసుకు అధికారికంగా తెరలేచింది. శుక్రవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌తో ఎఫ్1 సందడి మొదలైంది. ట్రాక్‌పైకి శునకాలు రావడం... ఇద్దరు డ్రైవర్లు అదుపుతప్పి గోడను ఢీకొట్టడం... అలోన్సో కారులో సాంకేతిక సమస్య తలెత్తడం... దూకుడు కొనసాగించి హామిల్టన్ మూల్యం చెల్లించుకోవడం.. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ వెటెల్‌ను వెనక్కినెట్టి ఫెరారీ డ్రైవర్ ఫెలిప్ మసా అగ్రస్థానాన్ని సంపాదించడం తొలిరోజు విశేషాలు. శనివారం మధ్యాహ్నం జరిగే క్వాలిఫయింగ్ సెషన్‌తో రెండో అంకం ముగుస్తుంది.

గ్రేటర్ నోయిడా: అనేక మలుపులున్న ఇండియన్ గ్రాండ్‌ప్రి బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్‌పై డ్రైవింగ్ చేయడం అనుకున్నంత సులువేమీ కాదని తొలిరోజే అన్ని జట్ల డ్రైవర్లకు తెలిసిపోయింది. ఆద్యంతం ఆచితూచి వ్యవహరిస్తేనే ఈ ట్రాక్‌పై విజయం సాధించే అవకాశాలున్నాయని శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో వారికి అవగతమైంది. ఈ సీజన్‌లో ఎదురులేని రెడ్‌బుల్ జట్టుకు ప్రాక్టీస్ సెషన్‌లో చెక్ పెట్టడంలో ఫెరారీ సఫలమైంది.

మధ్యాహ్నం నిర్వహించిన రెండో ప్రాక్టీస్ సెషన్‌లో ఫెరారీ డ్రైవర్ ఫెలిప్ మసా 1 నిమిషం 25.706 సెకన్లలో అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తిచేసి ఫాస్టెస్ట్‌గా నిలిచాడు. ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్) 1 నిమిషం 25.794 సెకన్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీకే చెందిన ఫెర్నాండో అలోన్సో 1 నిమిషం 25.930 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు అడ్రియన్ సుటిల్ (1ని:27.316 సెకన్లు) ఏడో స్థానంలో, పాల్ డీ రెస్టా (1ని:27.853 సెకన్లు) తొమ్మిదో స్థానంలో నిలిచారు. భారత తొలి ఎఫ్1 డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్‌కు నిరాశే మిగిలింది. హిస్పానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తికేయన్ చివరిదైన 24వ స్థానంతో సంతృప్తి పడ్డాడు.

అంతకుముందు ఉదయం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌లో మెక్‌లారెన్ డ్రైవర్ హామిల్టన్ 1ని:26.836 సెకన్లతో ఫాస్టెస్ట్‌గా నిలిచాడు. అయితే హామిల్టన్‌తోపాటు సెర్గియో పెరెజ్ (సాబెర్) దూకుడుగా వ్యవహరించడంతో స్టీవార్డ్స్ వీరిద్దరిపై మూడు స్థానాల గ్రిడ్ పెనాల్టీ విధించారు. వేగాన్ని తగ్గించాలని స్టీవార్డ్స్ రెండుసార్లు సూచించినా వీరు పట్టించుకోకపోవడంతో తప్పనిసరిగా పెనాల్టీని విధించారు. ఫలితంగా శనివారం జరిగే క్వాలిఫయింగ్ సెషన్‌లో ఒకవేళ హామిల్టన్ తొలి స్థానంలో నిలిస్తే ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను నాలుగో స్థానం నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. అలోన్సో కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో ఈ స్పెయిన్ డ్రైవర్ 24వ స్థానంలో నిలిచాడు. విలియమ్స్ జట్టు డ్రైవర్ పాస్టర్ మాల్డొనాడో... వర్జిన్ జట్టు డ్రైవర్ అంబ్రోసియో అదుపుతప్పి ప్రాక్టీస్ నుంచి మధ్యలోనే నిష్ర్కమించారు.

‘ట్రాక్ డిజైన్ వైవిధ్యభరితంగా ఉంది. అక్కడక్కడా ఇంకా దుమ్ము ఉంది. ఆఖరి మలుపువద్ద అనుకున్నరీతిలో కోరుకున్న మార్గంలో వెళ్లవచ్చు. ఈ ట్రాక్‌పై ఓవర్‌టేక్ చేసేందుకు కూడా పలుమార్లు అవకాశాలు ఉన్నాయి’ అని ఫెరారీ డ్రైవర్ మసా వ్యాఖ్యానించాడు.

‘తొలి ల్యాప్ ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. భారత్‌లో తొలిసారి డ్రైవ్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాను. ఇక్కడ ఎఫ్1 రేసు జరుగుతుందని ఊహించలేదు. ఇప్పుడు నిజమయ్యేసరికి నాలో ఎన్నో ఆలోచనలు కలిగాయి. మొత్తానికి తొలి సెషన్ సంతృప్తినిచ్చింది’అని భారత తొలి ఎఫ్1 డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ తెలిపాడు.

0 comments:

Post a Comment

 
Top