ఆమే అతడి సైన్యం దాసరి గుండె చెరువైంది. ఇన్నేళ్లూ ఆయనకు తోడూ నీడగా నిలిచి కష్టాల్లో సుఖాల్లో వెంట నడిచిన జీవిత భాగస్వామిణి పద్మ కన్నుమూశారు. పద్మ మరణంతో చెట్టంత మనిషి దాసరి కుప్పకూలిపోయారు. ఎన్ని వైఫల్యాలు చుట్టుముట్టినా ఎదురొడ్డి పోరాడి నిలిచిన దాసరిని భార్య మరణం బాగా కుంగదీసింది. ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ ఆడది ఉంటుందంటారు. దాసరి ప్రతి విజయం వెనుకా పద్మ ఉన్నారు. 1967లో దాసరి జీవితంలోకి ప్రవేశించిన పద్మ ‘పాలు-నీళ్లు’లాగా కలిసిపోయారు. అసలు వీరిద్దరి పరిచయమే ఓ సినిమా కథను తలపిస్తుంది. Tollyandhra Condolences
అవి దాసరి హైదరాబాద్‌లోని హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్న రోజులు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే, మరోపక్క తనకిష్టమైన నాటక రంగంలో రాణిస్తున్నారు దాసరి. పండక్కి పాలకొల్లు వెళ్తూ తోబుట్టువులకు గాజులు బహుమతిగా తీసుకెళ్లాలనుకున్నారు. కోఠీ సెంటర్ వెళ్లి గాజులు కొంటున్నారు. షాపువాడు ఏ సైజు గాజులు కావాలని అడిగాడు. దాసరికి ఏం చేయాలో పాలుపోలేదు. పక్కనే ఉన్న ఓ అమ్మాయిని చూపించి ‘‘ఆమె సైజులో గాజులు కావాలి’’ అని చెప్పారు. ‘‘ఏ కలర్ గాజులు కావాలి?’’ అడిగాడు షాపువాడు. ఈ సంభాషణ వింటున్న ఆ అమ్మాయి చొరవగా వచ్చి తనే గాజులు ఎంపిక చేసిపెట్టింది. దాసరికి ఆ అమ్మాయి నచ్చేసింది.

తనతో పరిచయం పెంచుకుంటే బావుంటుందనిపించింది. అందుకే ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పి ‘‘రేపు రవీంద్రభారతిలో నా నాటక ప్రదర్శన ఉంది... వీలైతే రండి’’ అని నాలుగు పాస్‌లు ఇచ్చారు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్‌ను తీసుకుని నాటకానికి వెళ్లింది. ఆ అమ్మాయే పద్మ. ఆ క్షణం మొదలైన పరిచయం ప్రణయానికి, ఆ తర్వాత పరిణయానికి దారి తీసింది. పద్మ నాన్నగారు హిందీ మాస్టారు. ఆయనకు దాసరి బాగా నచ్చేశారు. కానీ దాసరి ఇంట్లోవాళ్లు వ్యతిరేకించారు. అయినా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మద్రాసులో కాపురం పెట్టారు. దాసరి దర్శకుడు కావడం కోసం స్ట్రగుల్ పడుతుంటే పద్మ అండగా నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమే అతడి సైన్యం.

ఇంట్లో భార్య ప్రోత్సాహం ఉంటేనే కదా ఏ మగాడైనా బయట ప్రశాంతంగా తన ప్రతిభను ప్రదర్శించే వీలు చిక్కేది. ఎట్టకేలకు ‘తాత-మనవడు’తో దర్శకుడయ్యారు దాసరి. అక్కడనుంచీ విజయాలే విజయాలు. ఊపిరాడనంత బిజీ. కుటుంబ వ్యవహారాలన్నీ పద్మ చూసుకునేవారు. మరోపక్క రాజకీయాల్లో చేరి రాణించసాగారామె. మద్రాసులో ఆమె చాలా పాపులర్ అయ్యారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దక్షిణభారత సినిమా కార్మిక సమాఖ్య కార్యకలాపాల్లో కూడా చురుకైన పాత్ర పోషించారు. దాసరిలాగానే పద్మ కూడా కార్మిక పక్షపాతి.

ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుండేవారు. దాసరి సొంతంగా నిర్మించిన సినిమాలన్నింటికీ పద్మ సమర్పకురాలు. శివరంజని, మేఘసందేశం, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా... ఇత్యాది చిత్రాలన్నింటికీ ఆమె సమర్పకురాలు. చిత్రపరిశ్రమలోని ఎవరినైనా ఎంతో చనువుతో పలకరించేవారు ఆమె. పద్మ అంటే పరిశ్రమలోని పలువురికి ఎంత అభిమానమో అంతే భయం కూడానూ. ఎందుకంటే ఒక శ్రేయోభిలాషిగా ఎవరినైనా హెచ్చరించే స్వతంత్రం ఆమెకు ఉంది.

దాసరిని నేరుగా కలవలేని కొందరు పద్మ ద్వారా ఆ కుటుంబానికి చేరువయ్యేవారు. అందుకే ఆమె చిత్రపరిశ్రమలోని ఎందరికో తలలో నాలుకవంటి వ్యక్తి. అందుకే ఆమెలేరు అన్న వార్తను పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది. శుక్రవారం అందరూ అన్ని పనులు ఆపేసుకుని ఒక ఆత్మీయురాలుని పోగొట్టుకున్న విషణ్ణవదనంతో జూబ్లీహిల్స్‌లోని వారి ఇంటికి చేరుకున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా అటే అడుగు వేశారు. దాసరి శిష్యులైతే ఇక చెప్పనవసరంలేదు. వారి నోటి వెంట మాట రాలేదు. యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగులకు స్వస్తి చెప్పింది. పద్మ మరణం సినిమా రంగానికి తీరని లోటు.

చిత్రపరిశ్రమ నివాళి
యావత్ చిత్రరంగం పద్మ మరణంపట్ల దిగ్భ్రాంతితో కూడిన విచారాన్ని వ్యక్తపరిచింది. నిర్మాతల సంఘం, దర్శకులసంఘం, కార్మికుల సమాఖ్య, నటీనటుల సంఘం, చలనచిత్ర వాణిజ్య మండలి తదితర అన్ని సంఘాలూ పద్మ మృతికి విచారం వెల్లబుచ్చుతూ దాసరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపర్చాయి.

0 comments:

Post a Comment

 
Top