‘‘స్నేహితులతో కలిసి క్రిస్మస్ పండగ వేడుకలో పాల్గొన్నాను. చాలా ఎంజాయ్ చేశాను. ఇక న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా? అని ఆలోచిస్తున్నాను. ఇప్పట్నుంచీ ప్లాన్ చేస్తేనే జనవరి ఒకటిని సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవడానికి కుదురుతుంది’’ అంటున్నారు శ్రుతిహాసన్. ఈ ఏడాది ఆమె అనగనగా ఓ ధీరుడు, సెవెన్త్ సెన్స్, ఓ మై ఫ్రెండ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. హిందీలో ‘దిల్ తో బచ్చా హై జీ’లో ఈమె నటించారు. ఈ నాలుగు చిత్రాల జయాపజయాల సంగతి ఎలా ఉన్నా తన పాత్ర పరిధి మేరకు నటించడానికి శ్రుతి శాయశక్తులా కృషి చేశారు.

ఇదే విషయమై శ్రుతి చెబుతూ - ‘‘ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు. కానీ నేను ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేయడం అనేది నా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, పాత్రను పండించడానికి ఎంతవరకు కృషి చేయాలో అంతా చేస్తాను’’ అన్నారు. త్వరలో ఆమె నటించిన తమిళ చిత్రం ‘3’ విడుదల కానుంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సరసన ‘గబ్బర్‌సింగ్’లో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో పల్లెటూరి యువతిలా అగుపించబోతున్నారు. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ - ‘‘నేను పెరిగింది సిటీలోనే కాబట్టి పల్లెటూరి వాతావరణం నాకు తెలియదు. ఆ వేషధారణపై అవగాహన కూడా లేదు.

అందుకని ‘గబ్బర్‌సింగ్’లో చేస్తున్న పాత్ర నాకు థ్రిల్‌నిస్తోంది. ఇప్పటివరకు నేను ఏ పాత్ర చేసినా.. వాటిలో నా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉన్న అంశాలు కొన్నయినా ఉన్నాయి. కానీ ‘గబ్బర్‌సింగ్’లోని పాత్ర అందుకు పూర్తి భిన్నం. హిందీలో ఈ పాత్రను సొనాక్షి సిన్హా చేశారు. ఆ పాత్రకు ఇప్పుడు నేను చేస్తున్న పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. అంతలా పాత్రలో మార్పులు, చేర్పులు చేశారు. అసలు సిసలు పల్లెటూరి యువతిలా మౌల్డ్ అయ్యి, చేస్తున్నాను. కచ్చితంగా ఓ డిఫరెంట్ శ్రుతిని చూస్తారు. నా స్వభావానికి దూరంగా ఉండటంవల్లనో ఏమో ఈ పాత్ర నాకు చాలా కిక్ అన్పిస్తోంది’’ అని చెప్పారు.

0 comments:

Post a Comment

 
Top