ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీనూ కొన్ని తీపి గుర్తుల్ని, మరికొన్ని చేదు మరకల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. కొన్నేళ్లుగా వంద సినిమాలకు తక్కువ కాకుండా నిర్మాణమవుతూ వస్తున్న తెలుగు చిత్రరంగంలో ఎప్పుడూ కూడా సక్సెస్ రేటు పది-పదిహేను శాతానికి మధ్యనే ఉంటూ వచ్చింది.
www.Tollyandhra.com
2011ని పరిశీలించినప్పుడు కూడా అదే ఫలితం మనకు కన్పడింది. కాకపోతే... ఈ ఏడాది ‘దూకుడు’లాంటి ఓ బ్లాక్ బస్టర్ సినిమా, ‘అలా మొదలైంది’లాంటి ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ రావడం శుభపరిణామం. ఇక పంటికింద రాయిలాంటి పరిణామం ఏమంటే... ఈ ఏడాది 111 స్ట్రెయిట్ సినిమాలతో పోటీపడుతూ 119 వరకూ అనువాద చిత్రాలు తెరమీదకు రావడంతో ‘అసలు సిసలు తెలుగు సినిమా’ను నమ్ముకున్న దర్శక, నిర్మాతలను బాగా కలవరపరిచింది.

‘రాశి’లోనే కాకుండా అవి ‘వాసి’ (సక్సెస్) పరంగా కూడా తెలుగు సినిమాలను ‘సవాల్’ చేయడం వారికి మరింత విషగుళిక అయ్యింది. ఇక, ఈ ఏడాది కూడా కొంతమంది కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు ప్రజల ముందుకొచ్చి తమ ప్రతిభను చాటుకోవడం ముదావహం.

ఇలా మంచి, చెడుల మిశ్రమ నేపథ్యంలో... మరో అయిదు రోజుల్లో మనల్ని పలకరించబోతున్న 2012 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలని కోరుతూ... 2011లో చోటు చేసుకున్న తెలుగు చిత్రపరిశ్రమ నడతను ఒకసారి పరిశీలిస్తే ఈ కింది విషయాలు మనకు ద్యోతకమవుతాయి.

చిన్న సినిమాలకు ఊపిరి, ఉత్సాహం
ఏడాది ప్రారంభంలో వచ్చిన చిన్న సినిమా ‘అలా మొదలైంది’ పెద్ద విజయం దక్కించుకుని, లోబడ్జెట్ సినిమాల నిర్మాణం పెరగడానికి ఊపిరిపోసింది. కొత్త దర్శకురాలు నందినీరెడ్డి ఈ సినిమాని నడిపినతీరు, నిర్మాతగా కె.దామోదరప్రసాద్ చేసిన సాహసం, నాని సరసన నిత్యామీనన్‌ను కొత్తగా తెరమీదకు తెచ్చిన ఆలోచనా విధానం... చిన్న సినిమాల ఆశావహులకు ఆదర్శకంగా నిలిచింది.

అలాగే మరో చిన్న సినిమా ‘ప్రేమకావాలి’ కూడా సైలంటుగా పెద్ద లాభాలను రాబట్టడంతోపాటు, ఈ సినిమా ద్వారా పరిచయమైన సాయికుమార్ కుమారుడు ‘ఆది’ని హీరోగా నిలబెట్టడం, కొత్త నాయిక ‘ఇషా చావ్లా’కు కూడా ప్రామిసింగ్ నాయికగా పేరుతేవడం మరింత ఆనందాన్నిచ్చింది. అల్లరి నరేష్ ‘సీమటపా కాయ్’ కూడా సక్సెస్‌ఫుల్‌గా పేలింది. ఇదే కోవలో ఈ ఏడాది ఇంకో చిన్న సినిమా ‘పిల్ల జమీందారు’ కూడా నిశ్శబ్దంగా విజయాన్ని మూట కట్టుకోవడం చిన్న సినిమాలను తీసేవారికి, కొనేవారికి మరింత ఉత్సాహాన్ని పెంచింది.

‘పెద్ద’ విజయాలు
ఇక పెద్ద సినిమాల విషయానికొస్తే... ‘దూకుడు’ సినిమా టైటిల్‌కు తగ్గట్టే తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ ‘హై జంప్’ చేసేసింది. పోకిరి, మగధీర సినిమాల పేర్లు మాత్రమే అప్పటివరకు గుర్తు పెట్టుకున్న సినీ‘అభిమానుల’ డైరీలో ‘దూకుడు’ పేరు కొత్తగా చేర్చుకునేలా ఈ సినిమా హల్‌చల్ చేసింది. ఈ సినిమా మొత్తం వసూలు చేసింది... కొందరు ‘50 కోట్లు’ అంటే, మరికొందరు ‘70 కోట్లు’ అన్నారు. నిజానికి అది చేసిన కోట్లు ఎన్ని అనే విషయాన్ని పక్కన పెడితే... మహేష్‌బాబు, శ్రీను వైట్ల కెరీర్‌లో ఈ చిత్రం సువర్ణ అక్షరాలతో ‘కోట్’ చేసుకునే విధంగా పేరు తెచ్చుకుంది.

అలాగే మిస్టర్ పర్‌ఫెక్ట్, 100 పర్సెంట్ లవ్, కందిరీగ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా అందరికీ (నిర్మాతలకు, బయర్లకు, ఎగ్జిబిటర్లకు) లాభాల పంట పండించి, ఆ సినిమాలో ప్రధానపాత్రధారులు, తెరవెనుక ప్రధాన సూత్రధారులుగా నిలిచిన ప్రభాస్-కాజల్-దిల్‌రాజు-దశరథ్, నాగచైతన్య-తమన్నా - అల్లు అరవింద్-సుకుమార్, రామ్-హన్సిక-అక్ష - బెల్లంకొండ సురేష్-సంతోష్ శ్రీనివాస్‌లకు మరచిపోలేని మధురమైన 2011 సంవత్సరంగా నిలబెట్టాయి. మరో హై బడ్జెట్ సినిమా ‘బద్రినాథ్’ కూడా రాష్ట్రేతర ప్రాంతాల్లో వచ్చిన వసూళ్లు కలిపిన అనంతరం హిట్ సినిమాగానే పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ ఓ పరిధి మేరకు వసూళ్లు రాబట్టింది. రవితేజ ‘మిరపకాయ్’ కూడా ఓ స్థాయి మేరకు విజయాన్ని చేజిక్కికుంది.

‘డబ్’ మీద డబ్బు
ఇక, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదమైన చిత్రాల్లో దాదాపు 10 చిత్రాల వరకు భారీ విజయాలే సొంతం చేసుకున్నాయి. స్వీయ దర్శకత్వంలో లారెన్స్ చేసిన ‘కాంచన’ కోట్ల రూపాయలను కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సందడి చేసింది. జీవా చేసిన ‘రంగం’ కూడా సక్సెస్ బాటలో వీరంగం చేసింది. కొన్ని కేంద్రాల్లో ఈ చిత్రం సెలైంటుగా రికార్డు వసూళ్లు రాబట్టింది. విశాల్, ఆర్య చేసిన ‘వాడు-వీడు’ వెరయిటీగా జనాన్ని మెప్పించి డబ్బు ప్లస్ పేరు రెండూ తెచ్చి పెట్టారు. ‘నా పేరు శివ’ మొదటివారమే అందర్నీ ఆలోచింపజేసేలా పైసా వసూల్ చేశాడు.


ఈ ఏడాది ఆఖరులో జనం బాట పట్టిన ‘జర్నీ’ కూడా సక్సెస్ ప్రయాణాన్నే సాగిస్తోంది. దీనికిముందు మలయాళం నుంచి దిగుమతి అయిన ‘రతి నిర్వేదం’ బీసీ కేంద్రాల్లో మాత్రం తన ఉనికిని చాటుకుంది. ఇక స్వర్గీయ ‘సిల్క్ స్మిత’ నిజ జీవిత కథ అంటూ ప్రచారం సాగించి, ‘పరిణీత’ (చెందిన) నటి విద్యాబాలన్ కెరీర్‌లో వివాద సినిమాగా కూడా మారిన ‘ది డర్టీ పిక్చర్’ మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారత్‌దేశంలోనే కోట్లు కుమ్మరించిన సినిమాగా ముద్ర వేసుకుంది. ఇవి కాక... మరికొన్ని చిన్నాచితకా సినిమాలు కూడా అక్కడక్కడ కాసుల వర్షం కురిపించాయి.

కొత్త దరశకులు
‘అలా మొదలైంది’తో నందినీరెడ్డి, ‘కందిరీగ’తో సంతోష్ శ్రీనివాస్ పరిచయమై, రేపు రాబోయే మరిన్ని విజయాలకు వారు కేరాఫ్ దర్శకులుగా నిలిచారు. అలాగే ‘అహ నా పెళ్ళంట’తో వీరభద్రచౌదరి, ‘వీడు తేడా’తో చిన్నికృష్ణ, ‘ఎల్‌బీడబ్ల్యూ’తో ప్రవీణ్ సత్తార్ పరిశ్రమ దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఆ తర్వాత సినిమాలకు కూడా అవకాశాలు పొందగలిగారు. అలాగే ‘దునియా’ సినిమాతో ఎల్.కె.రావు ప్రశంసలందుకున్నారు.

హ్యాపీ హీరోస్
హీరోల్లో... ఈ సంవత్సరం అందరికన్నా హ్యాపీయెస్ట్ అండ్ లక్కీయెస్ట్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు అనాలి. ‘పోకిరి’ తర్వాత మళ్లీ ఎప్పుడెప్పుడు తన తడాఖా చూపించాలా అని ఎదురుచూస్తూ వచ్చిన మహేష్ ఆశలకు ‘దూకుడు’ ఆనందంగా గేటు వేసింది. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో ప్రభాస్, ‘100 పర్సెంట్ లవ్’తో నాగచైతన్య, ‘కందిరీగ’తో రామ్, ‘బద్రినాథ్’తో అల్లు అర్జున్, ‘అలా మొదలైంది’తో నాని ‘ఫుల్ హ్యాపీ’ జోన్‌లో ఉన్నారు. ఆది (తొలి) సినిమా (ప్రేమ కావాలి)యే హిట్ కావడంతో ‘ఆది’ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సంవత్సరం మరచిపోలేని ఆనందంలో ఉన్న హీరోల్లో బాలకృష్ణను ప్రత్యేకించి పేర్కొనాలి. బాపు వంటి గొప్ప దర్శకుడి చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో నటించడం, ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పెద్ద ఎత్తున పొందడం బాలయ్య కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.

అలాగే మరో అగ్రహీరో నాగార్జునకు కూడా ‘రాజన్న’ చిత్రం ద్వారా ఈ ఏడాది ప్రశంసల వెల్లువ దరి చేరింది. డిసెంబరు నెలాఖరులో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లపరంగా ఎటువంటి పూర్తి ఫలితాన్ని లిఖించుకుంటుందో అన్నది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అంశం. ఇక ‘మిరపకాయ్’ను కొరికి తీపిని ఆస్వాదించగల్గడం రవితేజకు ఈ ఏడాది మిగిల్చిన ఓ జ్ఞాపకం. అహ నా పెళ్లంట, సీమటపాకాయ్, మడతకాజా వంటి సినిమాలతో తనదైన ‘అల్లరి’ని ఈ సంవత్సరమూకొనసాగించి తనదైన ‘కామెడీ మార్క్’ జోరును మరింత పెంచుకోగలిగారు నరేష్. ‘పోరు తెలంగాణ’ సినిమాతో తనదైన సామాజిక స్పృహ బాటలో పయనించి మరోసారి ప్రజల మెప్పు పొందారు ఆర్.నారాయణమూర్తి.

‘తెలంగాణ’ సినిమాల హోరు
రాష్ట్రంలో రాజకీయంగా నెలకొన్న ‘ప్రత్యేక రాష్ట్రం నినాదం’ పరోక్షంగా సినిమా పరిశ్రమలో కూడా ప్రస్ఫుటంగా కన్పడింది. జై బోలో తెలంగాణ, పోరు తెలంగాణ, ఇంకెన్నాళ్లు తదితర సినిమాల జోరు ఆ సంగతిని మనకు కళ్లకు కట్టినట్లు చూపింది.

బ్యాక్ టు బ్యాక్
‘శ్రీరామరాజ్యం’తో దర్శకుడిగా తన పూర్వ వైభవాన్ని గుర్తుచేశారు బాపు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సంచలన హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె.విజయభాస్కర్ ఈ ఏడాది ‘ప్రేమకావాలి’తో తిరిగి తన సత్తాను చాటుకున్నారు. అదేవిధంగా ‘సంతోషం’ వంటి స్వీట్ సినిమాని గతంలో ఇచ్చిన దశరథ్ ఈ సంవత్సరం ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో, ‘సీమటపాకాయ్’తో నాగేశ్వరరెడ్డి తమ ఉనికిని తిరిగి ప్రదర్శించారు. దర్శకుడు హరీష్‌శంకర్ ‘మిరపకాయ్’తో పాత ‘షాక్’ నుంచి బయటికి రాగలిగారు. ‘గగనం’తో రాధామోహన్, ‘విరోధి’తో నీలకంఠ, ‘గోల్కొండ హైస్కూలు’తో మోహన్‌కృష్ణ, ‘సోలో’తో పరశురామ్ తమదైన క్రియేటివ్ ‘పేరు’ను నిలబెట్టుకున్నారు.

0 comments:

Post a Comment

 
Top