మానవుని చరిత్రలో మరవలేని, మహోన్నతమైన మధురానుభూతిని కలిగించే మహత్తరమైన దినం. ఎందుకనగా దేవుడు-మానవ జాతిని అంధకార సంబంధమైన అధికారములోనుండి విడుదల చేసి తన కుమారుని రాజ్య నివాసులనుగా చేయుటకు మరియు ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగ చేయుటకు యేసు క్రీస్తు ప్రభువును ఈ భుమి మీదకు నరావతారిగా పంపిన చారిత్రాత్మకమైన పుణ్య దినం క్రిస్మస్. క్రీస్తు మొదటి రాకడ - ప్రవచనాలు : లేఖనములు పరిశోధించుడి అవి నన్ను గూర్చి సాక్ష్యమిస్తాయి అంటాడు ప్రభువు. ఆయన జన్మను గూర్చి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అందులో ఆయన పేరును గూర్చి యెషయా 9:6, 14:7 లో స్పష్టంగా వ్రాయబడి యున్నది. యెషయా ప్రవక్త క్రీ.పూ 700 సంత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువును గూర్చి ప్రవచించాడు.ఆది వాక్యమైయున్న దేవుడు - శరీరధారిగా కృపా సత్యసంపూర్ణునిగా మన మధ్యనివసించెను. మానవ జాతి చరిత్రను రెండు భాగాలు చేసిన వాడు(క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం). క్రీస్తు మొదటి రాకడ కారణం: సృష్టిలో మొదటి మానవుడైన ఆదాము ద్వారా సంక్రమించిన పాపము భువిపై జన్మించిన ప్రతీ మనిషికీ సంప్రాప్తమైనది. ఆ వ్యాధి ద్వారా మానసిక శారీరిక రుగ్మతలలో, సాతాను బంధకాలలో స్వనీతిలో, హృదయంలో ఎవరూ నింపలేని శూన్యంతో జీవిస్తూ తనలోని కొరతను నింపుకోవడానికి అనేక దేవుళ్ళను చేసికొని వారిలో నిజమైన శాంతి, సమాధానము పొందలేక విముక్తి కోసం పరితపిస్తున్న సమయంలో కాలము పరిపూర్ణమైనపుడు దేవుడు - తన కుమారుని పంపెను. దేవునికి దూరస్తులును, దుష్క్రియలవలన మనసులో విరోధభావము గలవారునై యుండిన వారిని తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధనపరచెను. ఆ పిల్లలు రక్తమాంసములు గలవరైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయెను. అయితే ఈనాడు చాలామంది క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నవారు పరిశుద్ధ గ్రంధంలోని ఆయన ప్రవచనాల నెరవేర్పును ఆయన ఉన్నతమైన గుణలక్షణాలను ఆయన జన్మలోని రహస్యాన్ని హృదయ పూర్వకంగా గ్రహించి అంగీకరించకుండా కేవలం బాహ్య సంబంధమైన భౌతిక అలంకారాల కోసమే ప్రాధాన్యతనిస్తూ ఇతర మతస్తులు జరుపుకునే పండుగవలె క్రిస్మస్ ను ఒక పండుగ వలె జరుపుకుంటున్నారు. మానవుడు తన జ్ఞానంతో సృష్టించుకున్న అనేక మతాల పండుగల వలే క్రిస్మస్ ఒక మాతానికి కులానికి చెందిన పండుగకాదు. ప్రపంచ మానవ జాతి పాప విముక్తికోసం దేవుడే మానవుడిగా అవతరించిన మహోన్నతమైన పర్వదినం క్రిస్మస్. ఆయన నీ హృదయములో జన్మిస్తే నీవు ప్రతీరోజు పండుగ అనుభవించ గలవు ఈనాడు మన దేశంలో క్రీస్తు ప్రభువు దళితుల కులదేవుడిగా వారి యొక్క పండుగగా క్రిస్మస్ జరపబడడం ఎంతో విచారించదగ్గ విషయం. ఈనాడు క్రైస్తవులు కూడా పల్లెలో, పట్టణాల్లో ఈ పండుగ వేడుకల కోసం డిసెంబర్ మొదటి వారం నుండే అడ్వాన్స్ క్యారెల్స్, చింతలేదిక యేసు పుట్టెను పాటలు (హృదయంలో చింత పోకుండానే) నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం సాంస్కృతిక కార్యక్రమాలకోసం సిద్దపాట్లు తమ తమ స్వగ్రామాలకు ప్రయాణాలు, ఇళ్ళు, గుళ్ళు సున్నాలతో అలంకరణలు, పిండి వంటలు సంవత్సరమంత గుడికి రానివారు రావడంతో చర్చినిండిపోవడం, విష్ యు హ్యాపీ క్రిస్మస్ అంటూ అభినందనలు, ఇలా ఇంకా ఎన్నో రకాలైన బాహ్య సంబంధమైన ప్రాముఖ్యాలతో క్రిస్మస్ పండుగ దండుగ ఖర్చులతో ప్రేస్టేజి కోసం చేసిన అప్పుల బాధతో వెళ్ళిపోతుంది.  అయితే ఓ ప్రియ చదువరీ! ఒక్క నిమిషం ఈ విషయంలో దయచేసి ఆగి ఆలోచించుమని కాదు, సంవత్సరాని కొకసారి అలాచేసి, సంవత్సర మంతా నీ ఇష్టానుసారంగా జీవించమనికాదు. ఆయన శరీరాకారంలో జన్మించింది నీ కోసం మనందరి కోసం నీవు పండుగ నాడు చేసే ఆర్భాటాలు కాదు ఆయనకు కావలసింది ‘నీవు’, నీ హృదయంలో జన్మిస్తే పాప పంకిలమైన నీ హృదయంలోని శూన్యత, అజ్ఞానం, అయోగ్యత, అపవిత్రత, పాపభారం సంపూర్ణంగా తొలగించబడి ఆయనతో కలసి సహవాసం, సమాధానం, సంతోషం అనుభవించగలము. ఆయన యందలి విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడగలవు.  క్రిస్మస్ క్రైస్తవుడిగా కాక ప్రతిదినం క్రీస్తును వ్యక్తిగతంగా అనుభవిస్తూ అనుకరిస్తూ, అనుసరిస్తూ నీవున్న చోట ఆయన కోసం ఓ సాక్షిగా బ్రతకాలని ప్రజలు నీలో ఆయనను చూడాలని ఆ సత్య సువార్త నీ ద్వారా ప్రకటింపచేయాలని ఆయన కోరిక, ఆయన పేరే తెలియని ప్రజలు నీ చుట్టూ ఎంతోమంది వుంటూ ఉండగా మానవుడు వెతుక్కునే మోక్షమార్గం క్రీస్తు ప్రభువేనని ప్రకటించాల్సిన భారం, బాధ్యత నీ మీద వుండగా క్రిస్మస్ ని ఓ పండుగలా జరుపుకొని మరచిపోతే, రేపు ఆయన ధవళసింహాసనం ముందు నిలుచున్నపుడు నీవు ఎంత బాగా పండుగ జరపావని అడగడు, నా కోసం ఎన్ని ఆత్మలను రక్షించావు? నా నామాన్ని ఎంత మందికి ప్రకటించావు? నా నామంకోసం ఎన్ని అవమానాలు, హింసలు, పొందావు? అని అడుగుతాడు.  అప్పుడు నీ సమాధానం ఎమిటి? ఇప్పటికైనా, ఈ సంవత్సరమైనా ఆచార క్రిస్మస్ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, క్రైస్తవ విశ్వాసవీరునిగా ఆ మహా ప్రభువు, త్యాగమూర్తి యొక్క జన్మ ప్రాముఖ్యతను వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఆయన జన్మమును గూర్చి తెలియని వారికి తెలియజేయి. అప్పుడే నీ జీవితంలో ప్రతిదినం నిజమైన క్రిస్మస్ అనుభవించగలవు.  అట్టి కృప ప్రభువు దయచేయు గాక ఆమేన్! 

0 comments:

Post a Comment

 
Top