పికాసో.. నవ్య చిత్రకళా వికాసానికి ఒక నిట్రాయి
చిత్రకళా జగత్తులో మకుటంలేని మహారాజుగా, తన జీవితకాలంలోనే తానొక చారిత్రిక పురుషునిగా వెలుగొందినవాడు పాబ్లో పికాసో. స్పెయిన్ దేశపు మలగాలో 1881వ సంవత్సరంలో జన్మించిన పికాసో, 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి 19 యేండ్ల నూనూగు మీసాల నవయువకుడు. తన 8వ యేటనుంచి 91వ యేట మరణించే వరకు అప్రతిహతంగా రంగుల హరివిల్లులను చిత్రకళా జగత్తుపై చిలకరించిన రసగంగాధరుడతను. అతని చిట్టచివరి పెయింటింగ్ అయిన ’విశ్రాంతి తీసుకుంటున్న నగ్న స్త్రీ’ అన్న చిత్రం, అతను సమాధి చేయబడిన రోజునే ప్రజల దర్శనార్థం మ్యూజియంకు తరలించే సమయానికి దాని రంగులింకా ఆరనేలేదు.
నిస్సందేహంగా 20వ శతాబ్దపు అత్యంత ప్రతిభావంతులైన చిత్రకారులలో అతనిది ప్రథమ స్థానం. చిత్రకళలోనే కాదు, శిల్పంలో, కవిత్వంలోకూడా పికాసో అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడు. అతని చిత్రాలలోనే కాదు, 20వ శతాబ్దపు చిత్రాలలోనే తలమానికమైనది పాబ్లో పికాసో చిత్రించిన ‘గుయెర్నికా’.
పికాసో తండ్రి డాన్ జాయిస్ రూయిజ్ పేరున్న చిత్రకారుడే కాక స్పెయిన్ లోని ఒక మ్యూజియంకు సంరక్షకుడు కూడా. తల్లిపేరు డాన్ మారియా పికాసో. పాబ్లో పికాసో తన 8వ యేట వేసిన చిత్రాలు మొట్టమొదటి సారిగా ప్రదర్శింపబడి అతనికి బాల మేధావిగా గుర్తింపు తెచ్చాయి. పికాసో యొక్క 13వ జన్మదినం నాడు అతని తండ్రి, తాను ఉపయోగించే కుంచెలు, రంగులు, వాటినికలుపుకునే పేలెట్ (రంగులు కలుపుకునే పళ్లెం) జన్మదిన కానుకగా బహూకరించి , అప్పటి నుండి తాను చిత్రాలు వేయడం మానుకున్నాడు. ఇది ఒక కన్నతండ్రి, తన కుమారుడిని దీవిస్తూ ఇచ్చిన అమూల్యమైన కానుక.
ఆనాటి అందరు వర్ధమాన చిత్రకారుల వలెనే పికాసో కూడా చిత్రకళలో తన ప్రావీణ్యాన్ని మెరుగులు దిద్దుకోవడం కోసం 1900వ సంవత్సరంలో పారిస్ నగరానికి చేరుకున్నాడు. అప్పటినుంచి అతను పారిస్ నగరంలోనే వుంటూ, అప్పుడప్పుడు స్పెయిన్ దేశానికి, ముఖ్యంగా బార్సిలోనా నగరానికి వచ్చి వెళుతూ వుండేవాడు. 1904 సంవత్సరం నుండి పారిస్ నగరంలోనే వుండిపోయాడు. అప్పటినుండే అతను తన తండ్రి పేరుకు మారుగా తల్లి ఇంటిపేరైన పికాసో..ను తన పేరు చివర చేర్చుకుని ‘పాబ్లో పికాసో’గా పిలువబడసాగాడు.
1901 నుండి కొన్ని సంవత్సరముల పాటు, అతని జీవితంలో అత్యంత రసవత్తరమైన నీలిరంగు దశ (Blue Period) కొనసాగింది. అతని చిత్రకళపై విరుచుకుపడే విమర్శకులు కూడా ఇది అతని అత్యంత ఉత్కృష్టమైన దశగా పేర్కొంటారు. ఈ కాలంలో అతను వేసిన చిత్రాలన్నీ నీలిరంగు నేపథ్యాన్ని పొంది వుంటాయి. దీని తరువాత మరికొంత కాలం గులాబీ రంగు దశ (Pink Period) సాగింది. నీలిరంగు విచారానికి, ఉదాసీనతకు, నిరుత్సాహానికి ప్రతిబింబమైతే, గులాబీ రంగు దానికి పూర్తి వ్యతిరేకమైన ఉత్సాహానికి ప్రతీక. ఆ తరువాత ప్రతీకలను చిత్రాలలోకి తీసుక వచ్చిన ఘనవాద (Cubism) చిత్రాలు వేశాడు. ఇది అతను తన మిత్రుడైన బ్రేక్(Braque)తో కలసి ఆవిష్కరించాడు. ఈ “ఘనవాదశైలి” అతని జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి, ‘పికాసో’ అంటేనే ‘ఘనవాదం’ అనేంత వరకు వెళ్లింది. ఈ శైలికి అంతర్జాతీయ గౌరవాన్ని తీసుక వచ్చింది పికాసోనే. ఇంకా తన సుదీర్ఘ కళా జీవితంలో అనేక పోకడలకు పోయినప్పటికీ ముఖ్యమైనవి పై మూడు దశలు మాత్రమే.
1936వ సంవత్సరంలో బిస్కేగల్ఫ్ లోని ‘గుయెర్నికా’ అనబడే పల్లెపై జరిగిన అమానుషమైన బాంబుల దాడిలో 1684 మంది మరణించగా 809 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువభాగం ముసలివారు, స్త్రీలు, పిల్లలు. ఈ సంఘటనకు పికాసో చలించిపోయాడు. డాన్ మోర్ అనే పేరుగల పికాసో ప్రియురాలు తీసిన గుయెర్నికా విధ్వంసపు ఛాయాచిత్రాలను ప్రేరణగా తీసుకొని, వాటికి తనదైన శైలిలో 64 చిత్తు ప్రతులను వేసుకుని, వాటిని చివరకు 9 ప్రతిరూపాలుగా మార్చుకున్నాడు. 1937 మే ఒకటి నాడు సుమారు 30 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు గల ఒక అతి పెద్ద కాన్వాసుపై చిత్రీకరణ ప్రారంభించి 45 రోజులలో అంటే జూన్ 15 1937 నాటికి తన చిత్రరచనను పూర్తిచేశాడు. ఈ చిత్రం స్పానిష్ పెవిలియన్లో జూలై 1వ తేదీ నుండి ప్రదర్శనకు వుంచబడింది. 1937వ సంవత్సరంలోనే అనాటి కళా విమర్శకులు ‘గుయెర్నికా’ చిత్రాన్ని “ఇరవయవ శతాబ్దపు అత్యున్నత చిత్ర సృష్టి” అని కొనియాడారు. అప్పటిలో ఈ చిత్రాన్ని చూడటానికి దేశ దేశాలనుండి ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చారు. (ఈ చిత్రాన్ని క్రింద 8వ పేజీలో చూడండి)
పికాసో కాన్వాస్ పైనేకాదు కుండలపై, చెక్కలపై, చర్మాలపై, పింగాణిపై, గోడలపై చిత్రాలు గీశాడు. శిల్పాలు సృజించాడు. అతను చేయని ప్రయోగం లేదు. తాకని అంచులు లేవు. ఎదగని ఎత్తులు లేవు. తాను అమితంగా ప్రేమించిన, తనకంటే ముందు తరం వారైన మానె, ఇంగ్రెస్ మున్నగువారి సృజనాత్మక చిత్రాలను తనదైన ఘనవాద (Cubism) శైలిలో అనుసృజన గావించి వారిపై తనకుగల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.
మన మహాకవి శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, తిలక్ తదితరు లెందరో పాబ్లో పికాసో.. ప్రేరితులే, ప్రేమికులే. అతను నిజంగానే నవ్య చిత్రకళా వికాసానికి ఒక నిట్రాయి.

(విషయ సేకరణ: సప్తపర్ణి చిత్రకళా సంపుటి సౌజన్యంతో-)
విశ్వవిఖ్యాత చిత్రకళాకారుడు పాబ్లో పికాసో చిత్రకళా విన్యాసాలను క్రింది పేజీలలో తిలకించండి-
***
0 comments:
Post a Comment