ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుక మరో రెండు రోజుల్లో జరగనుంది. పసిడి పూత ఆస్కార్ బొమ్మను సొంతం చేసుకునే అదృష్టవంతులెవరో తెలుసుకోవడానికి ఆదివారం టీవీకి అతుక్కు పోవాలని పలువురు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపున ‘ఆస్కార్ ప్రిడిక్షన్స్ (జోస్యం)’ పేరిట అవార్డ్ ఎవరు సాధిస్తారనే కథనాలు హాలీవుడ్‌లో జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

ఉత్తమ నటి, నటుల విభాగంలో ఆస్కార్ గెల్చుకునే అవకాశం ఎవరికి మెండుగా ఉంది? అనే కథనాలను మంగళ, గురువారాల్లో ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, మిగిలిన కొన్ని ప్రధాన విభాగాల్లో ఆస్కార్ దక్కే ఆస్కారం ఎవరికి ఎక్కువ ఉందో ఇక్కడ తెలుసుకుందాం...

ఉత్తమ దర్శకుడు మైకేల్ హజనవిసియస్ ?
ఉత్తమ దర్శకుల విభాగంలో మైకేల్ హజనవిసియస్ (ది ఆర్టిస్ట్), అలెగ్జాండర్ పేనె (ది డిసెండెంట్స్), మార్టిన్ స్కోర్‌సెసె (హ్యూగో), వూడీ అలెన్ (మిడ్‌నైట్ ఇన్ పారిస్), టెర్రెన్స్ మల్లిక్ (ది ట్రీ ఆఫ్ లైఫ్)లు పోటీపడుతున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన నలుపు-తెలుపు చిత్రం ‘ది ఆర్టిస్ట్’. మైఖేల్ హజనవిసియస్ ప్రతిభకు ఈ చిత్రం ఓ నిదర్శనం అని హాలీవుడ్ వర్గాలు కితాబులిచ్చేశాయి. అలాగే ఇదే చిత్రానికిగాను ఉత్తమ రచయిత, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో కూడా మైకేల్ నామినేషన్ సాధించారు. ఈ ఏడాది ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ గెల్చుకోబోతున్న వ్యక్తి మైకేలే అనే అంచనాలు ఉన్నాయి.

ఉత్తమ చిత్రం ‘ది ఆర్టిస్ట్’ ?
ఉత్తమ చిత్రం విభాగంలో ది ఆర్టిస్ట్, హ్యూగో, ది డిసెండెంట్స్, ఎక్స్‌ట్రీమ్లీ లౌడ్ అండ్ ఇన్‌క్రెడిబ్లీ క్లోజ్, ది హెల్ప్, మనీ బాల్, వార్ హార్స్, మిడ్‌నైట్ ఇన్ ఫారిస్, ది ట్రీ ఆఫ్ లైఫ్ చిత్రాలు పోటీలో నిలిచాయి. ఈ జాబితాలో ప్రధానంగా ‘ది ఆర్టిస్ట్’పైనే అందరి కళ్లూ ఉన్నాయి. కలర్‌ఫుల్ సినిమాల హవా సాగుతున్న తరుణంలో విడుదలైన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రానికి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది. 1927 నుంచి 32 నేపథ్యంలో ఓ సీనియర్ నటుడు, యువ హీరోయిన్ మధ్య ఉండే అనుబంధంతో ఈ చిత్రం సాగుతుంది. మొత్తం 24 విభాగాల్లో దాదాపు తొమ్మిది విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ సాధించిన చిత్రం ఇది. ఆస్కార్‌ని కైవసం చేసుకోబోయే చిత్రం కూడా ఇదేనని జోస్యం చెబుతున్నారు.

ఉత్తమ సహాయ నటుడు క్రిస్టొఫర్ ప్లమ్మర్ ?
ఉత్తమ సహాయ నటుల విభాగంలో ‘బిగినర్స్’ చిత్రానికి క్రిస్టొఫర్ ప్లమ్మర్, ‘మై వీక్ విత్ మార్లిన్’కి కెన్నెత్ బరంగ్, ‘మనీ బాల్’ సినిమాకి జోనా హిల్, ‘వారియర్’కి నిక్ నోట్, ‘ఎక్స్‌ట్రీమ్లీ లౌడ్ అండ్ ఇన్‌క్రెడిబ్లీ క్లోజ్’ చిత్రానికి మాక్స్ వోన్ సిడో పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురిలో ఆస్కార్ దక్కించుకునే ఆస్కారం మెండుగా క్రిస్టొఫర్ ప్లమ్మర్‌కే ఉందని అంచనా వేస్తున్నారు. ‘బిగినర్స్’లో చిత్రకథానాయకుడు ఇవాన్ మెక్ గ్రెగోర్‌కి తండ్రిగా నటించారు క్రిస్టొఫర్. సినిమాలో ఆయన పాత్ర చనిపోతుంది. క్రిస్టొఫర్ పాత్రలో పలు ఎమోషన్స్ ఉన్నాయని, ఆ ఎమోషన్స్‌ని ఆయన అద్భుతంగా పలికించారని ప్రేక్షకులు కితాబులిచ్చేశారు. ఈ పాత్రకుగాను ఆయన ఇప్పటికే దాదాపు 15 అవార్డులు పొందారు. అంతగా ప్రేక్షకులను మెప్పించిన ఆయన నటనకు ఆస్కార్ ఖాయం అని అంచనా వేస్తున్నారు.

ఉత్తమ సహాయ నటి ఆక్టేవియా స్పెన్సర్ ?
ఆక్టేవియా స్పెన్సర్ అందం యావరేజ్. కానీ అభినయం అదుర్స్. ‘ది హెల్ప్’ చిత్రంలో చేసిన మిన్నీ జాక్సన్ పాత్రకు గాను ఆమె నామినేషన్ సంపాదించుకున్నారు. నల్ల జాతికి చెందిన మహిళ మిన్నీ జాక్సన్ పనిమనిషిగా చేస్తుంది. ముక్కుసూటితనం వల్ల ఇబ్బందులపాలవుతుంది. ఈ పాత్రకు ఆక్టేవియా వంద శాతం న్యాయం చేసిందనడానికి నిదర్శనం ఇప్పటికే ఆమె సాధించిన దాదాపు 10 అవార్డులు. ఇక ఆస్కార్ తీర్పు రావడమే ఆలస్యం. ఈ విభాగంలో పోటీపడుతున్న ఇతర నటీమణుల విషయానికొస్తే.. ‘ది ఆర్టిస్ట్’కి బెరినైస్ బెజో, ‘ది హెల్ప్’కి జెస్సికా చస్టయిన్, ‘బైడ్స్ మైడ్స్’కి మెల్లిసా మెక్ కార్తీ, ‘ఆల్బర్ట్ నాబ్స్’ చిత్రానికిగాను జానెట్ మెక్ తీర్ బరిలో ఉన్నారు.

ఉత్తమ ఒరిజినల్ సంగీత దర్శకుడు లుడోవిక్ బౌర్స్ ?
ఐదు లఘు చిత్రాలు, ఓ డాక్యుమెంటరీ చిత్రంతో పాటు మూడు చలన చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు లుడోవిక్ బౌర్స్. వాటిలో ‘ది ఆర్టిస్ట్’ ఒకటి. ఈ చిత్రానికే ఆస్కార్ పోటీలో నిలిచారు. ఈ చిత్రానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘బాఫ్తా’ అవార్డ్‌తో పాటు మరో నాలుగైదు అవార్డులు పొందారాయన. ఇప్పుడు తొలిసారి ఆస్కార్ నామినేషన్ సంపాదించుకున్నారు. తొలి గెలుపు ఖాయం అని హాలీవుడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఇంకా ఈ విభాగంలో ‘ది అడ్వంచర్స్ ఆఫ్ టిన్‌టిన్’కి జాన్ విలియమ్స్, ‘హ్యుగో’కి హొవార్డ్ షోర్, ‘టింకర్ టైలర్ సోల్జర్ స్పై’కి అల్‌బర్టో ఇగ్లెసియస్, ‘వార్ హౌస్’కి జాన్ విలియమ్స్ నామినేషన్ సంపాదించారు.

ఇవి కాకుండా ఇంకా పలు విభాగాల్లో పలువురు సాంకేతిక నిపుణులు పోటీపడుతున్నారు. మరి, ఈ ఆదివారం ఎవరికి తీపి గుర్తు అవుతుందో, ఎవరికి చేదు అనుభూతిని మిగిలిస్తుందో వేచి చూడాల్సిందే.

0 comments:

Post a Comment

 
Top