Telugu Movie reviewsRangam Movie Review
రివ్యూ వినండి:
'డిష్యుం డిష్యుం', 'ఈ' వంటి చిత్రాల కంటే ఆర్.బి.చౌదరి కుమారుడిగానే తెలుగువారికి పరిచయం ఉన్న జీవా మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి 'రంగం' సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్.యస్.ఇన్ఫో టైన్మెంట్స్  సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె.వి ఆనంద్ దర్శకత్వం వహించారు. జీవా సరసన నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా నటించింది. ప్రియ బాజ్ పాయి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్ రావు తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు. ఈ చిత్రానికి హారిస్ జై రాజ్ స్వరాలను సమకూర్చగా వెన్నెలకంటి సాహిత్యాన్ని అందించారు. రిచర్డ్.యం.నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా అంటోనీ ఎడిటింగ్ నిర్వహించారు. ఇప్పటికే 'కో' పేరుతొ తమిళంలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటుందో మన సమీక్షలో చూద్దాం.

కధ: 
అశ్వద్ (జీవా) నేటి పత్రిక అనే దినపత్రిక కోసం పనిచేసే ఫోటో జర్నలిస్ట్. ఎప్పుడూ సంచలన వార్తలతో నేటిపత్రిక సర్కులేషన్ను పెంచుతూ ఉంటాడు. అదే క్రమంలో తన సంచలన కధనాలతో చిన్న పిల్లను పెళ్ళి  చేసుకోవాలనుకున్న ప్రతిపక్ష నాయకుడు భండారాన్ని బయటపెట్టి జైలుకు పంపిస్తాడు. అలానే తనతో పాటు పనిచేస్తున్న సరో(ప్రియ బాజ్ పయి), ప్రియ(కార్తిక) లలో సరోని కాదని ప్రియను ప్రేమిస్తాడు అశ్వద్. మరో వైపు ప్రతిపక్ష లీడర్ జైలుకు వెళ్ళడంతో గెలుపు మీద ధీమాగా ఉన్న ముఖ్యమంత్రి(ప్రకాష్ రాజ్)ని కూడా తప్పు చేసినందుకు ఒకానొక సమయంలో ప్రజల ముందు దోషిగా నిలబెడతాడు అశ్వద్. ఈ సమయంలోనే వసంత్ అనే యువలీడర్ యువరాజ్యం పార్టి పెట్టి ఎన్నికలలో నిలబడతాడు. అతను చేస్తున్న మంచిపనులకు అశ్వద్ కూడా మద్దతు ప్రకటించి మంచి కధనాలు పత్రికలో వచ్చేట్టు చూస్తాడు. ఆ విధంగా జనంలో మంచి పలికుబడి పెంచుకుంటున్న వసంత్ నిర్వహిస్తున్న మీటింగులో బాంబు పేలి 30 మంది వరుకు అతని కార్యకర్తలు చనిపోతారు. ఆ ప్రమాదంలో సరో కూడా చనిపోతుంది. ఆ విషాదాన్ని చూసి జనాలు వసంత్  పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారు. వసంత్ విజయం గురించి ప్రత్యేకమైన ఆర్టికల్ తయారుచేసే పనిలో ఉన్న అశ్వద్ కు సరో ప్రమాదంలో చనిపోలేదు ఎవరో చంపేసారు అని తెలుస్తుంది. ఇక అక్కడినుండి కధ ఆసక్తి కరమైన మలుపులు తిరిగి అర్ధవంతమైన ముగింపుతో సుఖాంతమవుతుంది.

విశ్లేషణ:

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రంగం మీడియా వీరంగం. ప్రెస్ తలచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలదు, అవసరం అయితే నిలబెట్టగలదు అనే విషయాన్నీ నిరుపించడమే ప్రధాన లక్ష్యం గా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు కె వి ఆనంద్. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన ఆనంద్ తన అనుభవాలకు మంచి ఆలోచనలు  జోడించి 'రంగం' సినిమాను రూపొందించాడు. కాకపోతే యువత రాజకీయాల్లోకి రావటానికి అయన నిర్దేశించిన మార్గాలు సినిమాటిక్ కోణంలో వాస్తవానికి దూరంగా ఉన్నాయి. సినిమా అనేది ఊహలలో నుండి, కల్పన నుండి పుట్టేది కాబట్టి అయన ప్రయత్నం మేచ్చుకోతగిందే. అలాగే చివరకు ఆయన కధను ముగించిన విధానం బాగుంది. కధ కధనాలు పక్కన పెడితే సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. సాంకేతికంగా ఉన్నత విలువలతో తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా బాగున్నాయి. పీటర్ హెయిన్స్ పోరాటాలు, బృంద మాస్టర్ తదితరులు వేయించిన డాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హారిస్ జై రాజ్ స్వరపరచిన పాటలు వినటానికి ఎంత బాగున్నాయో చూడటానికి అంతకంటే బాగున్నాయి. 

జీవా అశ్వద్ పాత్రలో ఒదిగిపోయి చక్కగా నటించాడు. నటనలో, డాన్సుల్లో, ఫైటుల్లో ఇజ్ కనబరిచి తనదైన శైలిలో రక్తికట్టించాడు. జోష్ తరవాత ఏమైపోయిందో అడ్రెస్ లేని కార్తీక ఈ సినిమాలో మంచి పాత్రలో నటించింది. కాకపోతే నటనలో ఇంకాస్త పరిణితి ప్రదర్శించి ఉంటే బాగుండేది. కోట శ్రీనివాస్ రావు, ప్రకాశ రాజ్ తమ పాత్రలకు అనుగుణంగా వారి సహజ ధోరణిలో నటించారు. మిగిలిన పాత్రలలో నటించిన వారు మనకు అంతగా పరిచయం లేని వారు. కానీ వసంత్ పాత్రలో నటించిన అజ్మల్ మంచి మార్కులు వేయించుకుంటాడు.

ప్లస్ పాయింట్స్:

రంగం సినిమాకు దర్శకత్వం ప్రధాన ప్లస్ పాయింట్. ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యం, జీవా నటన కూడా ప్లస్ పాయింట్సే  ఈ చిత్రానికి . అలాగే హారిస్ జై రాజ్ పాటలు వాటిని చిత్రీకరించిన విధానం అదనపు ఆకర్షణ. మరీ ముఖ్యంగా 'నెమలి నడకలు .. ' పాటను చిత్రకరించిన ప్రదేశాలు కన్నుల పండవగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

రొటీన్ గా అనిపించే కధనం, కామెడీ లేక పోవడం ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్స్.

కొసమెరుపు:
 రంగం వీరంగం... వీరంగంగానే ఉంది కానీ ఫార్ముల సినిమాలు, స్టార్ ఇమేజ్ కు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఎంత వరుకు నచ్చుతుందో వేచి చూడాలి. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా చివరికి కలక్షన్లే కదా సినిమా విజయానికి ప్రాతిపదిక ...!

రేటింగ్: 3 /5
తారాగణం: జీవ, కార్తిక, పియా బాజ్ పాయ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు 
బ్యానర్: ఆర్.యస్.ఇన్ఫో టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: హరీష్ జైరాజ్ 
నిర్మాత: జయరామన్ 
దర్శకత్వం: కే.వి.ఆనంద్

0 comments:

Post a Comment

 
Top