పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా(86) ఆదివారం తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. ఈ ఉదయం 7.40 నిమిషాలకు సత్యసాయి బాబా దేహాన్ని వదిలి వెళ్లినట్టు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాయణం వసంత రుతువు చైత్ర బహుళ సప్తమి ఉత్తరాఢ నక్షత్రంలో భక్త జనబాంధవుడు నిర్యాణం చెందారని తెలిపింది. గత 28 రోజులుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా ఈ రోజు లోకాన్ని విడి చారు. కార్డియో వాస్కులర్ ఫెయిల్యూర్‌తో మరణించినట్టు ట్రస్ట్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. బాబా భౌతిక కాయాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా సాయి కుల్వంత్ మందిరంలో రెండు రోజుల పాటు ఉంచనున్నట్టు తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి బాబా భౌతిక దేహాన్ని దర్శించుకోవచ్చని తెలిపింది. బాబా మరణంతో పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది.

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పెద్ద వెంకమ రాజు రత్నాకరం దంపతులకు 1926 నవంబర్ 23న బాబా జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక మార్గం పట్టిన బాబా ప్రేమతత్వాన్ని బోధించారు. నా జీవితమే నా సందేశం అని ప్రవచించిన బాబా ప్రపంచ మానవాళిని ప్రభావితం చేశారు. కేవలం ఆధ్యాత్మిక బోధనలకే పరిమితం కాకుండా ప్రభుత్వాలే నివ్వెరపోయేలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు అత్యున్నత ప్రమాణాలతో విద్య, వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. పలు జిల్లాల్లో వందలాది గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. 2009 ఒడిశాలో వరద బాధితులకు 699 ఇళ్లు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తన ట్రస్ట్ ద్వారా బాబా సేవలందిస్తున్నారు. బాబా సేవలకు గుర్తింపుగా 1999 నవంబర్ 23న ప్రభుత్వం తపాల బిళ్ల విడుదల చేసింది.

0 comments:

Post a Comment

 
Top