ఉత్కంఠ పోరులో విజయ నాదం
ఫలించిన 28 ఏళ్ల భారత్ నిరీక్షణ
ఫైనల్స్‌లో లంకేయులు చిత్తు చిత్తు
గెలిపించిన గంభీర్, ధోనీ, యువీ
నెరవేరిన సచిన్ స్వప్నం
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ యువరాజ్
వ్వావ్వ్‌వ్.... యాహూ... హుర్రే... శబ్బాష్ష్‌ష్... సూపర్... ధోనీ సేన గెలిచింది. దేశం మొత్తం ఊగిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యావద్భారతం ఉర్రూతలూగింది. ఆనందం పట్టలేక ఎగిరి గంతేసింది. విజయోద్వేగంతో గంతులేసింది. భారత వీరుల వీర విహారం చూసి తనువెల్లా పులకించింది. ఇది మామూలు ఆట కాదు. మనోళ్లు కొట్టారు.. ఇరగ్గొట్టారు.. చితగ్గొట్టారు.. గెలిచారు. దేశాన్ని గెలిపించారు. కోట్లాది అభిమానులను మురిపించారు. 


కప్పు... వరల్డ్ కప్పు... క్రికెట్ వరల్డ్ కప్పు.. ఎన్నాళ్లుగానో.. ఎన్నేళ్లుగానో.. ప్రతి భారతీయుడికీ ఓ తీరని కల. ఇన్నాళ్లకు మన కుర్రాళ్లు ఆ ముచ్చట తీర్చారు. చరిత్రను పునరావృతం చేశారు. 1983నాటి లార్డ్స్‌ను... 2011లో వాంఖడేలో ఆవిష్కరించారు. 28 సంవత్సరాల తర్వాత దేశానికి కప్పు అందించారు. అంతేకాదు... 'సచిన్‌కు ప్రపంచ కప్పును బహుమతిగా అందిస్తాం' అన్న మాట నిలబెట్టుకున్నారు.

శ్రీలంకను చిత్తు చేశారు. 1996 వరల్డ్‌కప్ సెమీస్‌లో... కోల్‌కతాలో శ్రీలంక చేతిలో ఎదురైన అవమానకర ఓటమికి తిరుగులేని ప్రతీకారం తీర్చుకున్నారు. టాస్‌లో చుక్కెదురైనా... లంకేయులు 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచినా... ఏ దశలోనూ తడబడలేదు. వీర విజృంభణ చేస్తాడనుకున్న వీరేంద్ర సెహ్వాగ్ రెండో బంతికే డకౌట్ అయినా, శత శతకాల వీరుడిగా చరిత్ర సృష్టిస్తాడనుకున్న సచిన్ 18 పరుగులకే పెవిలియన్ ముఖం పట్టినా.... అదరలేదు,బెదరలేదు.

'అంతా అయిపోయినట్లే' అనుకుని అటు స్టేడియంలో, ఇటు దేశవ్యాప్తంగా టీవీల ముందు కూర్చున్న అభిమానుల్లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒక్కో పరుగుతో ఆశలు రేకెత్తించారు. వీలైతే ఫోర్, కాకుంటే రెండు... అదీ కాకుంటే సింగిల్! బంతికి, కాలికి పని చెబుతూనే ఉన్నారు. స్కోరు బోర్డును కదిలిస్తూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాక... ధోనీ రంగ ప్రవేశం చేశాడు. అసలే ఫామ్‌లో లేడు.

ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ 50 పరుగులు చేయలేదు. ఇప్పుడేం చేస్తాడు.... అని 'శంకావాదులు' సందేహిస్తూనే ఉన్నారు. ఈ అనుమానాలను ధోనీ తన బ్యాట్‌తో బద్దలు కొట్టాడు. అటు ధోనీ, ఇటు గంభీర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. మరో మూడు కొడితే వంద పూర్తవుతాయనగా... బలమైన షాట్‌కోసం ప్రయత్నించిన గంభీర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విజయానికి బలమైన పునాదులు వేసి... మిగిలిన పని పూర్తి చేయాల్సిన పనిని ధోనీ, యువరాజ్‌లకు అప్పగించాడు.

ఈ ఇద్దరూ బంతి బంతినీ బాదుతూ... పరుగుల వరద పారించారు. విజయానికి నాలుగు పరుగుల దూరంలో ఉండగా... మరో పది బంతులు మిగిలి ఉండగానే... ధోనీ ఓ బంతిని ఉతికి 'ఆరేసి' గెలుపును పరిపూర్ణం చేశారు. 'ఇప్పటిదాకా మా సత్తా ఇంకా పూర్తిగా చూపలేదు' అని ఫైనల్స్‌కు ముందు చెప్పిన ధోనీ.... శ్రీలంకపై తన పూర్తి సత్తాను ప్రదర్శించాడు.

తొండితో టాస్ గెలిచినప్పటికీ... శ్రీలంక మ్యాచ్‌ను మాత్రం గెలవలేకపోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచి శ్రీలంక బ్యాటును కట్టేశారు. అడపాదడపా బంతి ముందుకు కదిలినప్పటికీ ఫీల్డర్లు చిరుతల్లా ఉరికి ఉరికి పట్టేశారు. 15 ఓవర్లదాకా ఇదే సీన్! లంకేయుల మొత్తం స్కోరు 210 - 220 దాటదనుకున్నప్పటికీ... చివరికి పరిస్థితి మారింది. ఈ టోర్నీలో అంతగా ఫామ్‌లో లేని మహేళ జయవర్ధనే సెంచరీ కొట్టి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.

చివరి పవర్‌ప్లేలో లంకేయులు గర్జించడంతో మొత్తం స్కోరు 274 పరుగులకు చేరింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఛేదిస్తే... ఇలాంటి భారీ లక్ష్యాన్నే ఛేదించాలి. అప్పుడే గెలుపులో మజా! అసలైన ఆనందం! ఈ ఆనందాన్ని శనివారం యావద్భారతం సంపూర్ణంగా ఆస్వాదించింది. గెలుపు ఖాయం కాగానే కుగ్రామాల నుంచి మహా నగరాల దాకా పండగే పండగ! మధ్యాహ్నం 2.30 నుంచి 'కర్ఫ్యూ'ను తలపించిన నగరాలు... ఆ తర్వాత అభిమానుల ఆనంద నృత్యాలతో సందడిగా మారాయి.

బాణసంచాతో దద్దరిల్లాయి. అటు విదేశాల్లోని భారతీయులు కూడా ఈ విజయంతో సంబరాలు చేసుకున్నారు. ఇటు.. వాంఖడేలో భారత విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల ఆనందానికి హద్దులే లేవు. ఈ విజయాన్ని సాధించిన భారత జట్టు ఉద్వేగాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. హర్భజన్‌తో సహా పలువురు ఆటగాళ్లు భావోద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు. జట్టు సభ్యులంతా స్టేడియం చుట్టూ తిరుగుతు ప్రేక్షకులకు అభివాదాలు తెలిపారు.

భారత జట్టుకు 'తాత'లాంటి సచిన్‌ను, గెలుపు వ్యూహాలను అందించిన కోచ్ కిర్‌స్టన్‌ను భుజాలపై ఎత్తుకుని ఊరేగారు. ఐసీసీ ప్రెసిడెంట్ శరద్ పవార్ చేతుల మీదుగా ధోనీ సైనికులు ప్రపంచకప్‌ను అందుకున్నారు. అటు పరుగులతో, ఇటు వికెట్లతో అద్భుత ప్రతిభ చూపిన యువరాజ్‌సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.13.50 కోట్ల నజరానా లభించింది.
ఏడాదిగా వ్యూహం...
ఇది ఆషామాషీగా వచ్చిన లభించిన గెలుపు కాదు. సునాయసమైన గెలుపు అసలే కాదు. ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదు. ఏడాదికాలంగా... చాపకింద నీరులా సాగుతున్న వ్యూహానికి ఫలితమిది. 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోనీ, 'సైలెంట్ కిల్లర్' కోచ్ కిర్‌స్టెన్‌ల కృషి ఫలితమిది. జయ్‌హో టీమ్ ఇండియా! జయ్‌హో భారత్!

0 comments:

Post a Comment

 
Top